అది చూసి కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు : కేటీఆర్

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. సిరిసిల్ల గోడల మీద రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని.. ‘నేతన్న చావొద్దు.. నీ కుటుంబం ఉసురు పోసుకోవద్దని నాటి రాయించి, ఆత్మస్థైర్యం నింపారు.’ అని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

వ్యవసాయం తర్వాత రెండో అతి పెద్ద రంగం చేనేత, జౌళి రంగం అని కేటీఆర్ తెలిపారు. ఈ రంగంపై కేసీఆర్‌కు మొదట్నుంచి అవగాహన ఉందని .. దుబ్బాకలో హైస్కూల్‌లో చదువుకున్న సమయంలో పద్మశాలీ ఇంట్లో ఉండేవారని చెప్పారు. అప్పట్నుంచే చేనేత కళాకారుల కన్నీళ్ల గురించి కేసీఆర్‌కు తెలుసన్నారు.

భూదాన్‌ పోచంపల్లిలో ఒకటే వారంలో ఎనిమిది మంది చేనేత కళాకారులు ఆత్మహత్య చేసుకున్నారని.. అది చూసి చలించిపోయిన కేసీఆర్, జోలెపట్టి డబ్బులు సేకరించి, లక్ష రూపాయల చొప్పున ఇచ్చారని వెల్లడించారు. ఎవరూ చావొద్దని.. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కుల వృత్తులను కాపాడుకుంటామని అప్పుడు కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు చేనేత కళాకారులను కేసీఆర్ ఆదుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news