ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణ మెల్లగా పుంజుకుంటోంది. ఇప్పటికే కోడెల ఆత్మహత్య చేసుకున్న గది ఆమూలాగ్రం పరిశీలించి పరిశోధించిన పోలీసులు.. ఇప్పుడు కాల్ డేటా ఆధారంగా విచారణ ముమ్మరం చేస్తున్నారు. కోడెల ఆత్మహత్యకు కుటుంబ కలహాలు, కొడుకుతో విబేధాలు కూడా కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు కోడెల శివరామ్ ను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
కోడెల అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. అందుకే ఒకటి, రెండు రోజుల్లో కోడెల కుమారుడు శివరామకృష్ణను తెలంగాణ పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కోడెల కుమారుడిని అడగాల్సిన ప్రశ్నల జాబితా రెడీ చేసుకున్నారట. మరోవైపు కోడెల ఆత్మహత్యకు కుమారుడే కారణమని ఆయన మేనల్లుడు కుంచేటి సాయిబాబు చేసిన ఫిర్యాదును హైదరాబాద్ పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆ ఫిర్యాదులోని అంశాలను విచారించాలని కోరుతూ సత్తెనపల్లి పోలీసులు.. బంజారాహిల్స్ పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా కంప్లయింట్ కాపీ పంపారట. కోడెల గత నెలలో తనకు పలుమార్లు శివరాం మానసికంగా వేధిస్తున్నారంటూ ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని సాయి ఇప్పటికే మీడియా ముందు కూడా చెప్పారు. ఇదే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారట. ఈ నేపథ్యంలో కోడెల కుమారుడి విచారణలో ఏమైనా వివరాలు దొరుకుతాయేమోనని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు.. కోడెల కాల్ డేటాను కూడూ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆయన చనిపోయే ముందు ఎవరెవరికి కాల్ చేశారనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఆయా నెంబర్లకు కాల్ చేసి విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు కొద్ది గంటల ముందు కోడెల బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన ఓ వ్యక్తితో దాదాపు 20 నిమిషాలు మాట్లాడినట్టు గుర్తించారు. ఆ వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. కోడెల బలవన్మరణం వెనుక ఇంకా ఏవైనా కారణాలున్నాయా? మానసికంగా ఎవరైనా వేధించారా? ఇతర సమస్యలున్నాయా?.. అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.