బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

-

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు తమ ప్రాంతంలోని సమీప ఆలయాలకు పోటెత్తుతున్నారు. మరికొందరేమో కుటుంబ సభ్యులతో ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయాని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇవాళ అమ్మవారి జన్మదినం సందర్భంగా 108 కలశాల జలాలతో అర్చకులు అభిషేకం చేశారు. పద్మశాలి సంఘం తరఫున అందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పూజారి తెలిపారు. అభిషేక సేవలో ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామున 3 గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. సరస్వతీ తల్లీ అనుగ్రహం ఉంటే తమ పిల్లల భవిష్యత్ బంగారంలా ఉంటుందని తల్లిదండ్రుల నమ్మకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version