గాంధీ ఆస్పత్రిలో ర్యాగింగ్ కలకలం.. పది మంది విద్యార్థులు సస్పెండ్

-

కళాశాలలు, యూనివర్సిటీల్లో యాంటీ ర్యాగింగ్​ కమిటీలు ఎన్ని ఉన్నా.. కొన్ని కళాశాలల్లో మాత్రం ఇంకా ర్యాగింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ర్యాగింగ్ వల్ల కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ర్యాగింగ్​ను అధికారులు అరికట్టలేకపోతున్నారు. తాజాగా సికింద్రాబాద్‌ గాంధీ వైద్యకళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపింది.

గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్‌ చేసిన ఘటనలో పది మంది సీనియర్‌ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. కొత్తగా చేరిన విద్యార్థులను కొంతమంది సీనియర్లు రాత్రిళ్లు హాస్టల్‌ గదులకు పిలిపించి వారం నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు. దీనిపై బాధితులు కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీతో దిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్‌ సెల్‌కు ఫిర్యాదు చేశారు.

అంతర్గత విచారణలో పది మంది సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసినట్లు నిర్థారణ కావడంతో వారిని కళాశాల, వసతిగృహం నుంచి సస్పెండ్‌ చేసినట్లు వైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ర్యాగింగ్​కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news