నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని కస్తూర్భా పాఠశాలలో సోమవారం రాత్రి దాదాపు 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్ల రాత్రి భోజనం చేసిన తరువాత సుమారు 100 మంది విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. గమనించిన తోటి విద్యార్థులు వసతి గృహం నిర్వాహకులకు సమాచారం అందించారు.
వెంటనే వారు హుటాహుటిన 80 మంది విద్యార్థినులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మిగితా వారికి భీంగల్ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. గత రాత్రి భోజనం చేసిన తరువాత విద్యార్థినులకు వాంతులు కావడంతో కలుషితాహారమే కారణమని అధికారులు తేల్చారు. విద్యార్థినులు తిన్న ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించారు.
విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు. కలుషిత ఆహారం అందించిన వసతి గృహం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాల సంగతి ఎలా ఉన్నా తమ పిల్లలు సర్దుకుపోతున్నారని.. కనీసం ఆహారమైనా శుభ్రమైన, ఆరోగ్యకరమైనది అందించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే వసతి గృహంలో ఆహార సదుపాయం, ఇతర వసతుల గురించి అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేశామని అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ పిల్లలకు ఏదైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.