రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఇంటి నుంచి వెళ్లిన బాలుడు అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఓ బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల అతడి కోసం వెతికారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో చివరకు రాత్రి 2 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 7 గంటలకు బాలుడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్క బ్లాక్ ముందు రక్తపు మడుగులో బాలుడు పడి ఉండటం కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా విద్యార్థి ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసకావటం.. చదువు ఒత్తిడి తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయని తల్లిదండ్రులు చెప్పడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.