నాసిరకం మయోనైజ్ తని 17 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. నగరంలోని అల్వాల్‌లోని గ్రిల్ హౌజ్ హోటల్ నిర్లక్ష్యంతో మయోనైజ్ విషంలా మారి పలువురు కస్టమర్ల ప్రాణాలకు ముప్పు తెచ్చింది. షవర్మతో కలిపి మయోనైజ్ తిన్న కస్టమర్లంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.
ఐదు రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటనలో బాధితుల సంఖ్య 17కి పెరగడంతో స్థానికంగా పరిస్థితులు వేడెక్కాయి. బాధితులంతా కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రి, హర్ష ఆస్పత్రి, బోయిన్‌పల్లి, బాలనగర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా అధికారి (ఎఫ్‌ఎస్‌ఓ) లక్ష్మీకాంత్ తెలిపారు. వారంతా ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు. బాధితుల రక్తంలో హానికర సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.
బాధితులను పరామర్శించి వైద్యులతో మాట్లానని.. బాధితుల రక్తపరీక్షల్లో సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారని చెప్పారు. సోమవారానికి బాధితుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని లక్ష్మీకాంత్ తెలిపారు.