అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో జరగనున్న ఈ అద్భుత ఘట్టం కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జనవరి 22వ తేదీన అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహరాజ్ తెలిపారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 6 రోజుల పాటు జరుగుతుందని .. వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోదీ 6 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించలేరని వెల్లడించారు.
అందుకే జనవరి 16 నుంచి 21 వరకు జరిగే అన్నీ పూజా కార్యక్రమాల్లో ఆయనకు బదులుగా ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తన సతీమణితో కలిసి అన్ని పూజల్లో పాల్గొంటారని వివరించారు.జనవరి 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుందని స్పష్టం చేశారు. మోదీ ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి, భగవంతుని దర్శనం చేసుకుంటారని, తరువాత హారతి ఇస్తారని ఆయన తెలిపారు.