నేడు జీహెచ్‌ఎంసీలో మూడో విడత రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ

-

పేదల సొంతింటి కలను నేరవేర్చి ఆత్మగౌరవంతో బతికేలా చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 9వేల 600 కోట్ల వ్యయంతో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఎంతో విలువైన స్థలాల్లో నిర్మించిన ఇళ్ల పంపిణీలో రాజకీయ ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌ డ్రా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి విడతలో 11వేల 700ల మందికి, రెండో విడతలో 13 వేల 200 మందికి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించారు.

ఇక తాజాగా మూడో విడతలో 36వేల 884 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. మూడో విడతలో భాగంగా ఇవాళ 19వేల 20 మందికి పంపిణీ చేయనున్నారు. మిగతా ఇళ్లను ఈనెల 5వ తేదీన అందించనున్నారు. ఈరోజు.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో హోం మంత్రి మహమూద్‌ అలీ, చేవేళ్ల పరిధిలోని శంకర్‌ పల్లిలో గనుల శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తారు.

మన్‌సాన్‌పల్లి, అబ్దుల్లాపూర్‌ మెట్‌లలో  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లి నల్లగండ్లలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, రాజేంద్రనగర్‌ నార్సింగిలో మేయర్‌ విజయలక్ష్మీ, పటాన్‌చెరు పరిధిలోని కొల్లూరు-2 లో  మంత్రి హరీశ్‌ రావు, మేడ్చల్‌ పరిధిలోని అహ్మద్‌గూడలో మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్‌ పరిధిలోని రాంపల్లిలో మంత్రి తలసాని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version