భగభగమనే ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం రోజున ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి చెందారు. హైదరాబాద్ నగరంలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్‌లో 13.3, కూకట్‌పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన భయానక పరిస్థితి సృష్టించింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని దేవేందర్ కాలనీకి చెందిన మాదాసు నాగబాల గంగాధరరావు(38), చింతపల్లి సుబ్రమణ్యం(40) మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి వారిపై పడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడకూలి ఓ కార్మికుడు (22) మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో రైతు కుమ్మరి మల్లేశం(36), సంగారెడ్డి జిల్లా అందోలు మండలం ఎర్రారం గ్రామానికి చెందిన బోయిని పాపయ్య(52) పిడుగుపాటుకు గురి కాగా .. వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామానికి చెందిన ఆబర్ల దయాకర్(22), నవీన్ కలిసి ట్రాక్టరులో వెళ్తుండగా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో ఎండిన వృక్షం విరిగి వారిపై పడటంతో దయాకర్ మృతిచెందారు. పాతబస్తీ పరిధి బహదూర్‌పురలో విద్యుదాఘాతంతో ఒకరు మరణించారు.