తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో మార్పు వస్తుందని ఆశించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నా.. ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారని ఆరోపించారు. మా పార్టీ.. మాఇష్టం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం చెల్లదని సూచించారు.
ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టాక ప్రజలు భారీగా తరలివస్తున్నారు. గతంలో ప్రగతిభవన్ లోకి హోంమంత్రికి కూడా ప్రవేశం ఉండలేదు. హోం మంత్రిని ఒక హోంగార్డు అడ్డుకుని వెనక్కి పంపించారని పేర్కొన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న సైతం ప్రగతిభవన్ ముందు గంటల కొద్దీ నిలబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు సీఎంను కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం ఉండేది కాదు. ఈనాడు సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కలవచ్చని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం సభలో నిరసన తెలిపినందుకు ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్నే రద్దు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.