తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు 5 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల సమయంలోనే సమగ్ర కుటుంబ తరహా సర్వేను నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ సర్వే ద్వారా ఒక్కో కుటుంబం వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ప్రతీ కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, వాహనాలు, గ్యాస్ కనెక్షన్లు తదితర వివరాలతో పాటు రేషన్ కార్డు వివరాలను అధికారులు సేకరించనున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2014 ఆగస్టు 19న ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. అయితే.. ఆ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే పంటల బీమా పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పంట బీమా పథకాన్ని రైతు యూనిట్‌గా అమలు చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు.