తెలంగాణలో ఈ నెలా పాత పింఛన్లే

-

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పథకాల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేసింది. ఇప్పుడు మరికొన్ని హామీలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే పింఛన్ల విషయంలో మాత్రం ఇంకా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లను ఈ నెలలో పాత పంథాలోనే విడుదల చేయనున్నారు.

ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు జమ చేయనున్నారు. ప్రస్తుతం సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగ పింఛను రూ.3,016 వస్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగ పింఛనును రూ.6,000 చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ హామీ ఎప్పటి నుంచి నెరవేరుతుందనే స్పష్టత లేనందున పాత తరహాలోనే పింఛన్లను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,98,729 మంది వృద్ధులు, 15,60,707 మంది వితంతువులు, 5,03,613 మంది దివ్యాంగులు, బీడీ కార్మికులు 4,24,585 మంది, ఒంటరి మహిళలు 1,42,394, గీత కార్మికులు 65,307, చేనేత కార్మికులు 37,145, హెచ్‌ఐవీ బాధితులు 35,998.. ఇలా వివిధ వర్గాలవారు మొత్తం 43,96,667 మంది పింఛన్లు పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version