తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీఎస్పీ ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. అయితే ఈ సభలో అపశృతి చోటు చేసుకొంది. మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
వేములవాడ బైపాస్ రోడ్డులో సిరిసిల్ల, వేములవాడ బీఎస్పీ అభ్యర్థులతో కలిసి ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. సభకు బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు రెండు నియోజకవర్గాల అభ్యర్థులు హాజరయ్యారు.భారీగా జనం తరలిరాగా..వారి కోసం పెద్దెత్తున షామియానాలను ఏర్పాటు చేశారు.అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే షామియానాలు కూలిపోవడంతో గందరగోళం నెలకొంది..సభకు హాజరైన ప్రజలు భయాందోళనకు గురై చెల్లాచెదురై పారిపోయే యత్నం చేశారు.షామియానాలు కూలి పలువురిపై పడటంతో దాదాపు 15మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు..డాక్టర్ ప్రవీణ్‌కుమార్ గాయపడిన వారిని పరామర్శించారు..టెంట్లు సరిగ్గా వేయకపోవడం వల్లనే కూలిపోయాయని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు.