తెలంగాణలో టీడీపీ పోటీపై అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

-

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అంశంపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి తెలంగాణ టీడీపీ నేతలతో సినీ నటుడు, తమ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ  చర్చిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

బాలకృష్ణ ఇటీవల హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయడమా?, పొత్తులో ముందుకు వెళ్లడమా. అనేది కోర్ కమిటీలో చర్చిస్తామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల పొత్తులపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

 చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో మాట్లాడకుండా.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొందరు ఆయన అరెస్ట్‌ను ఖండిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని కొందరు నేతలు.. ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఎన్నికలను ప్రభావితం చేస్తాయని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీడీపీ లేదని కొందరు మాట్లాడుతున్నారని.. అయితే టీడీపీ ఎక్కడుందో త్వరలో చూపిస్తామని చెప్పారు. 

Read more RELATED
Recommended to you

Latest news