కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కుంగుబాటు, దానిపై విజిలెన్స్ విచారణ ఆ తర్వాత పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం ఇవాళ సందర్శించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు.
అఖిలపక్ష ఎమ్మెల్యేల మేడిగడ్డ టూర్ షెడ్యూల్ ఇదే
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే.. 10.15 వరకు సభలో పాల్గొంటారు.
అనంతరం అసెంబ్లీ నుంచి బస్సుల్లో నేరుగా మేడిగడ్డకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు.
రెండు గంటలపాటు సైట్ విజిట్ ఉంటుంది. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఉంటుంది.
కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
నిర్మాణ లోపాలు ఎత్తి చూపేందుకు మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ప్రభుత్వ ఖర్చుతో తీసుకెళ్తామని శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 40 బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు.