రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో పర్యటించిన ఆయన నగర ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా పాతబస్తీలో రోడ్‌షో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మాధవిలతను గెలిపించి మోదీ నాయకత్వానికి మద్దతివ్వాలని అమిత్ షా కోరారు. తొలుత లాల్ దర్వాజ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షా.. లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం నుంచి సుధా సినిమా థియేటర్ వరకు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో చేపట్టారు. అమిత్‌షాకు కాషాయ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు.
“40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం దక్కడం లేదు. రజాకార్ల ప్రతినిధి 40 ఏళ్ల నుంచి పార్లమెంటుకు వచ్చి కూర్చుంటున్నారు. ఈసారి అవకాశం వచ్చింది. సోదరి మాధవీలతను భారీ మెజార్టీతో గెలిపించండి. రజాకార్ ప్రాతినిధ్యం నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ను ఒకరి చేతిలోనే ఉంచే ధైర్యం ఎవరికీ లేదు. హిందూ,ముస్లిం తేడా లేకుండా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయండి. హైదరాబాద్‌ను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు మద్దతివ్వండి.” అంటూ అమిత్ షా కోరారు.