కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలోనే ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌లు.. 2జీ, 3జీ ,4 జీ పార్టీలు అని పేర్కొన్నారు. 2 జీ అంటే కేసీఆర్, కేటీఆర్.. 3జీ అంటే 3 తరాలుగా రాజకీయాలు చేస్తున్న ఒవైసీ కుటుంబ పార్టీ.. 4జీ పార్టీ అంటే జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా, సోనియా, రాహుల్ గాంధీ.. 4 తరాలుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు చేస్తోందని వివరించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దేనని ఆరోపించారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతోనూ అవినీతి చేశారు. మద్యం కుంభకోణాలకు సైతం పాల్పడ్డారు. తెలంగాణ తొలి సీఎం దళితుడే అని కేసీఆర్ చెప్పారు. 2 సార్లు అధికారంలోకి వచ్చినా దళితుడిని సీఎం చేయలేకపోయారు. 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఏపీని నిధులివ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మించలేకపోయారు. అయోధ్యలో రామమందిరం నిర్మించకుండా కాంగ్రెస్ అన్యాయం చేసింది. జనవరి 22న రామమందిరంలో రామ్‌లాల్‌ను ప్రాణప్రతిష్ఠ చేస్తాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే అయోధ్యలో ఉచితంగా రామ దర్శనం చేయిస్తాం.” అని అమిత్ షా తెలిపారు.