హైదరాబాద్ లోని నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి మరో అరుదైన ఘనతను సాధించింది. నిమ్స్ ఆసుపత్రిలో మొదటిసారిగా రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతం అయిందని యూరాలజీ, అవయవ మార్పిడి బృందం తాజాగా ప్రకటించారు. నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. అయితే అది సక్సెస్ కాకపోవడంతో తీవ్ర కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ పొందిన వ్యక్తి నుంచి తీసిన కాడవెరిక్ కిడ్నీని రోబోటిక్ సర్జరీ ద్వారా మార్పిడి చేశారు. గతంలో శస్త్ర చికిత్స జరిగినందున ఈ ఆపరేషన్ చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ.. ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తి అయిందని వైద్యులు తెలిపారు.
ఈ శస్త్ర చికిత్సలో కొత్తగా మార్పిడి చేసిన కిడ్నీ వెంటనే పని చేయడం ప్రారంభం అయిందని రోగి త్వరగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఏడాదిలో గత 2 నెలల్లో నిమ్స్ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసింది. దీంతో ఇప్పటివరకు నిమ్స్ వైద్యుల మొత్తం కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీల 2వేలకు చేరువైంది. ఈ రోబోటిక్ కిడ్నీ శస్త్ర చికిత్స దక్షిణ భారతదేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన తొలి ఆపరేషన్ అని యూరాలజిస్ట్, ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పేర్కొన్నారు. +