తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీని ఏఐసీసీ ప్రకటించింది. అయితే సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని పీసీసీ స్వాగతిస్తుందని.. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ పార్టీలో ఎవరైనా రాజ్యసభ ఎంపీ కావచ్చని.. ఈ విషయం తెలియక కొందరు బీఆర్ఎస్ నేతలు అవాక్కులు, చవాక్కులు పేల్చుతున్నారని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు అడ్వకేట్ అయిన సింఘ్వీ రాజ్యసభలో ఉండటం ఎంతో అవసరమన్నారు. సింఘ్వీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను కొట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చిందని మండిపడ్డారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో రెండు సార్లు ప్రజలు ఓడించినా కూడా బీఆర్ఎస్ కు ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. మహిళలను అవమాన పరిచేలా కేటీఆర్ మాట్లాడారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిరంజన్. బీఆర్ఎస్ కి తగిన బుద్ది చెబుతామన్నారు.