తెలంగాణ శాసనసభ రేపటికి (శుక్రవారం) వాయిదా వేశారు స్పీకర్. సభ ప్రారంభమయ్యాక దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం తెలుపుతూ ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, దానం నాగేందర్, ఇతర ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి సభను రేపు 10 గంటలకు వాయిదా వేశారు.
ఇక సాయన్నకి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్ మాట్లాడుతూ.. సాయన్న నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారని అన్నారు. ఆయనతో తనకి వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని తెలిపారు. సాయన్న కుటుంబం తమ కుటుంబం లాంటిది అన్నారు కేసీఆర్. ఆయన లేని లోటు తీరనిదని, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.