జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఒంటిగంటకు గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి రోడ్డుపై ఉన్న ఎస్.బి.ఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. ఏటీఎంను బద్దలు కొట్టి చోరీ చేశారు. డబ్బాల్లో నగదు తీసుకొని తమ కారులో పారిపోయే ప్రయత్నం చేసారు. అయితే పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా, దొంగలు కంటపడడంతో పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు.
పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దొంగలు నగదు బాక్స్ ను పడేసి వెళ్లిపోయారు. దీంతో నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డుపై వరుసగా పడిన నోట్లను ప్రజలు సైతం పట్టించుకోలేదు. చిత్తు పేపర్లుగా భావించి లైట్ తీసుకున్నారు. అయితే పోలీసులు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించి, రోడ్డుపై పడిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 3 లక్షలకు పైగా విలువైన నోట్లు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.