మటన్ ముక్క ఉడకలేదని కొట్టుకున్నారు.. వినడానికి ఫన్నీగా ఉన్న ఇది నిజం. బిర్యానీ విషయంలో పలు చోట్ల కస్టమర్లు, హోటల్ సిబ్బంది గొడవ పడుతున్న ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. తాజాగా, మటన్ ఉడకలేదని మొదలైన వివాదం ఏకంగా కస్టమర్లు, వెయిటర్లు కొట్టుకునే వరకు వెళ్లింది. అసలేం ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్‌లో న్యూ ఇయర్ సందర్భంగా ధూల్ పేట్‌కు చెందిన కొందరు బిర్యానీ తినటానికి హోటల్‌కు వెళ్లారు. మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, మటన్ సరిగా ఉడకలేదని..తాము డబ్బు పూర్తిగా చెల్లించమని వెయిటర్లతో గొడవ పడ్డారు. దీంతో, వివాదం చిలికి చిలికి గాలివానగా మారటంతో వెయిటర్లు ఏకంగా వారిపై కర్రలతో దాడికి తెగబడ్డారు.
అతి దారుణంగా కొట్టడంతో కస్టమర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న వినియోగదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన వెయిటర్లను అరెస్ట్ చేశారు. విషయం తెలిసి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తక్షణమే హోటల్ యజమానితోపాటు దాడి చేసిన అందరినీ అరెస్ట్ చెయ్యాలని ఆబిడ్స్ స్టేషన్ సీఐని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.