కేంద్రం పేరు చెప్పి సింగరేణిని ప్రైవేటీకరిస్తే గల్లాపట్టి గుంజుకొచ్చి కేసీఆర్ సంగతి చెబుతాం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు… సింగరేణిలో 51 శాతం రాష్ట్రానికి ఉంటే.. 49 శాతం వాటా ఉన్న కేంద్రం ఎట్లా ప్రైవేటీకరణ చేస్తుందని ప్రశ్నించారు. సాధ్యం కాదని ప్రధానమంత్రే స్వయంగా చెప్పినా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు.
బిజెపి నేత శ్రీ చందుపట్ల సునీల్ రెడ్డి మంథని నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర పేరిట గత 15 రోజులుగా నిర్వహించిన పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏయ్ ట్విట్టర్ టిల్లు… మీ అయ్య లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవ్… నీ అయ్య పేరు చెప్పుకుని పదవులు సంపాదించి ఊరేగుతున్న చరిత్ర నీది… నమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం పోరాడి ఈ స్థాయికి వచ్చిన చరిత్ర నాదన్నారు.
బీఆర్ఎస్ లో ఎవరికైనా సీఎం అయ్యే అర్హత ఉందా? కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి తప్ప ఏ ఒక్కరైనా బీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కాగలరా? అని ఫైర్ అయ్యారు. మంథని నియోజకవర్గంలో లాయర్ వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై హత్య చేస్తే శిక్షించకుండా వదిలేస్తారా? బిజెపి అధికారంలోకి వస్తే వాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదు. కఠినంగా శిక్షించి తీరుతాం. తెలంగాణలో ప్రశాంతత రావాలంటే రామరాజ్యం రావాలన్నారు.