కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్రలో జరిగిన ఉద్రిక్తతపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములతో దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. అరెస్టు చేసే సమయంలోనూ స్వాముల పట్ల పోలీసుల ప్రవర్తన మంచిగా లేదంటూ ధ్వజమెత్తారు. స్వాములు పోలీసులను తిట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీక్షలో ఉన్న వారు బూతులు మాట్లాడరని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు సంయమనంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కానీ.. గొడవను పెద్దది చేయడం సరికాదని హితవు పలికారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులపై డీజీపీకి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన స్వాములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే.. ?
కరీంనగర్‌లోని మంచిర్యాల కూడలి నుంచి నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఓ యువకుడు శోభయాత్రలో తల్వార్ తిప్పుతూ నృత్యం చేయడంతోహనుమాన్ స్వాములు అతడిపై దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులు యువకుడిని రక్షక్ వాహనంలో తరలించే యత్నం చేశారు. మాలధారులు రక్షక్ వాహనం వెనుక పరుగెత్తుతున్న తరుణంలో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో స్వాములను పోలీసులు మూడవ టౌన్ స్టేషన్‌కు తరలించారు.