తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్లో బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ నుంచి వచ్చిన 240 డిజైన్ చీరలను ఆడపడుచులకు అందించనున్నారు. ఈనెల 25 నుంచి పంపిణీ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 30 సర్కిళ్లలోని 150 డివిజన్లలో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా పంపిణీ జరుగుతుంది.