తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ చీఫ్ గా రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి పీసీసీ ఎవరనేదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున లాబీయింగ్‌లు మొదలయ్యాయి. అధిష్ఠానం పెద్దలను ప్రసన్నం చేసుకుని, ఈ పదవిని దక్కించుకునేందుకు ముఖ్యనేతలు తమ ప్రయత్నాలు షురూ చేశారు. ఇప్పటికే పలువురు నేతలు హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు ఎస్సీ, బీసీ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఆయనకు సన్నిహితులైన, ఆయనను ఒప్పించగలిగిన నాయకుల దగ్గర లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ రేసులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పాత తరం కాంగ్రెస్ నేతలు కూడా భట్టికి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిసింది. అధిష్ఠానాన్ని ప్రభావితం చేయగలిగిన నేతలతో భట్టి లాబీయింగ్ చేస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం.