కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొంగ రాజకీయాలు, చీకటి మంతనాలు మానుకోవాలని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సూచించారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో కుచాన్ పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుస్తుందని ఇంటెలిజెన్స్, వివిధ మాధ్యమాల సర్వేలు చెబుతున్నాయని అన్నారు. మెదక్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశం ఉందని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలు బీజేపీ పార్టీవేనని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ నుంచి కాషాయ జెండాను ఎగరవేస్తామని అన్నారు. 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని రఘునందన్ పేర్కొన్నారు.