రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. గెలుపే లక్ష్యంగా కమలనాథులు కార్యాచరణ చేపడుతున్నారు. వచ్చే నెల ప్రథమార్థంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాసంగ్రామ యాత్ర తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలను చేపట్టాలని బీజేపీ భావిస్తోంది.
ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలు ప్రారంభించేందుకు బీజేపీ సమయాత్తమవుతోంది. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన బీజేపీ నేతలు బాసర, సోమశిల, భద్రాచలం నుంచి యాత్రలను ప్రారంభించాలని నిర్ణయించారు. బాసర జోన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలను కలిపి ఒక రూట్‌గా ఏర్పాటు చేశారు.
అలాగే, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు సోమశిల జోన్ పరిధిలో. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలను భద్రాచలం జోన్‌గా విభజించారు. 33జిల్లాల్లో 19 రోజులు 4 వేల కిలోమీటర్లు చుట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. రథయాత్రలో భాగంగా రోజు 2 నియోజకవర్గాలను చుట్టేలా భాజపా నేతలు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. అలాగే, అసెంబ్లీ నియోజక కేంద్రాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించింది.