తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కీలక నియోజక వర్గాల్లోను గులాబీ పార్టీని ఓడించి గెలుపు తీరాలకు చేరింది. మరోవైపు ఎంఐఎం కూడా తన ఖాతా తెరిచి చార్మినార్ నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే బోణీ కొట్టింది. దుబ్బాక నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఆయన గెలుపొందారు.
గత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి గెలుపొందగా ఆయన అకాల మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉపఎన్నికలో రామలింగారెడ్డి సతీమణికి గులాబీ పార్టీ టికెట్ ఇవ్వగా బీజేపీ తరఫున రఘునందన్ రావు బరిలోకి దిగి ఆ ఎన్నికలో గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీలోకి దిగి విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారంలో ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సెంటిమెంట్ ఆయనకు బాగా కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.