అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ సారి మొదటి విడతలో.. సుమారు 87 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోస్థానంగా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆయన గజ్వేల్ నుంచి మాత్రమే పోటీలో ఉంటారని సమాచారం. మొత్తంమీద సుమారు పది మంది మాత్రమే కొత్త అభ్యర్థులుండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అభ్యర్థులెవరినీ మార్చకపోవచ్చని.. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉండదని తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒకటి రెండు మార్పులకే అవకాశం ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక స్థానంలో మాత్రమే మార్పు చేయవచ్చని సమాచారం. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై చర్చ జరిగినట్లు సమాచారం.