టిఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి. కేసీఆర్ కేంద్రంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బిఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుండి ఇస్తారని అనలేదా..? అంటూ నిలదీశారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రయివేటు సంస్ధలతో కుమ్మక్కు అయ్యి ప్రజా ధనం దుర్వినియోగం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్ లో చెప్పామన్నారు. అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం కాదన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎటుపోయాయని ప్రశ్నించారు మల్లు రవి. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్స్ ను కేంద్రం దృష్టికి ఏనాడైన తీసుకువెళ్లారా..? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలపై రాజకీయంగా లబ్ది పొందాలని బిఆర్ఎస్ చూస్తోందన్నారు. పేరుకు 24 గంటల ఉచిత విద్యుత్ అంటున్నారు కానీ అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు.