తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధికార బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వారికి బీ ఫారాలు అందజేయనుంది. మరోవైపు ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు వరాలు ప్రకటించనున్నారు. మేనిఫెస్టోపై కొంతకాలంగా కసరత్తు చేస్తున్న కేసీఆర్ .. ఇతర పార్టీలు ఇస్తున్న హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు… వివిధ సర్వేల ఆధారంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి వంటి పథకాల ఆర్థికసాయాన్ని మరింత పెంచనున్నట్లు హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు మహిళలను ఆకర్షించేందుకు రెండు సిలిండర్లు ఉచితంగాఇవ్వడంతో పాటు రైతులకు ఫించన్లు, ఉచితంగా ఎరువులను… మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలు ఉండనున్నట్లు సమాచారం..
- ఆసరా పింఛన్లు, సాగు పెట్టుబడి సాయం పెంపు
- బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వంటగ్యాస్ సిలిండర్‌కు భారీగా సబ్సిడీ
- రాష్ట్రమంతా పేద కుటుంబాలకు వర్తించేలా సీఎం కేసీఆర్ బీమా
- నిరుపేద మహిళలకు నెలనెలా రూ.3 వేల ఆర్థికసాయం
- ఎకరానికి 2 బస్తాల ఉచిత యూరియా వంటి హామీలు ఉండే అవకాశం