తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావించిన కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను వివిధ దశల్లో వడబోసి ఎట్టకేలకు 58 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాని ఈరోజు కాంగ్రెస్ విడుదల చేయనుంది.
అయితే 70 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైనా… వామపక్షాలతో పొత్తు చర్చలు నడుస్తున్నందున 58 స్థానాలకే తొలి జాబితా విడుదల చేయాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. ఖమ్మం నుంచి… మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో దిగనున్నారు. వామపక్షాలతో పొత్తు, ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ నేతలు సమావేశమై.. అనేక విషయాలు చర్చించారు. స్క్రీనింగ్ కమిటీ మరోమారు సమావేశమయ్యే పరిస్థితి లేనందున..ఈ భేటీలో మరో 22 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలిసింది.
వరంగల్ తూర్పు కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి, డోర్నకల్ రామచంద్ర నాయక్, మహబూబాబాద్ మురళీ నాయక్ పేరు ఖరారుచేసినట్లు సమాచారం. వాటిని రెండో జాబితాలో విడుదల చేయనన్నట్లు సమాచారం. గతంలో 70 స్థానాలపై స్క్రీనింగ్‌కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినా ఇవాళ 58 మందితోనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నారు. వామపక్షాలు పొత్తుకు సంబంధించి ఐదుస్థానాలు పక్కన పెట్టారు.