తెలంగాణలో మరోసారి గవర్నర్, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవలే అంతా సర్దుకుందని భావిస్తున్న సమయంలో గవర్నర్.. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను తిరస్కరించారు. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ మంత్రులు తప్పుబట్టారు. రాజకీయ నేపథ్యం ఉందని ఇద్దరు పేర్లను తిరస్కరించడం అత్యంత దుర్మార్గం అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎస్టీ, ఎంబీసీ సామాజిక వర్గాలను అగౌరవపరచినట్లేనని వ్యాఖ్యానించారు.
గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ మంత్రులు ఆరోపించారు. సర్కారియా కమిషన్ సిఫారసు ప్రకారం రాజకీయాలకు సంబంధం లేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ పలుమార్లు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. మంత్రిమండలి సిఫారసు చేసిన పేర్లను తిరస్కరించడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండించిన మంత్రులు.. తమిళిసైకి గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. నైతిక విలువలు ఉంటే.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.