మరికాసేపట్లో బీఆర్ఎస్ నేతల భవితవ్యం తేలనుంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో.. ఎవరికి హ్యాండ్ ఇస్తారోనన్న ఉత్కంఠకు తెర పడనుంది. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఓవైపు.. మరో ఛాన్స్ కోసం ఆశగా చూస్తున్న వాళ్లు ఇంకోవైపు ఉన్న ఈ తరుణంలో కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాను వెల్లడించనున్నట్లు సమాచారం.
105 మందితో తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 8 నుంచి 10 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. 14 మంది మంత్రులకు సిట్టింగ్ స్థానాలు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జనగామ, స్టేషన్ ఘన్ పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఉప్పల్, వైరా, వేములవాడ, నర్సాపూర్ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గజ్వేల్ నుంచే మళ్లీ పోటీ చేయనున్నారట.