తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీ కేడర్‌ను బలపరుచుకోవడంపై ఫోకస్ పెట్టాయి ప్రతిపక్షాలు. ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్ను గద్దె దించాలన ప్రయత్నంలో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. శ్రావణ సోమవారాన్ని మంచిరోజుగా భావిస్తున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ తొలిజాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 105 మంది పేర్లను ఒకేసారి ప్రకటించిన గులాబీ దళపతి.. ఈసారి కొన్ని మినహా దాదాపు అన్నిస్థానాల్లో అభ్యర్థులను ఒకేసారి వెల్లడించే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ ప్రాధాన్యమిస్తూ జాబితా సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. మంత్రులతోపాటు కాంగ్రెస్, టీడీపీల నుంచి చేరిన MLAలదరికీ మళ్లీ టికెట్ ఖాయమైనట్లు సమాచారం. సుమారు 10 చోట్ల.. కొత్తముఖాలు కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి.