ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చాలా మంది నేతలు అదుపుతప్పి అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. అలా నోరుజారి అప్రతిష్టపాలవ్వడమే కాకుండా ప్రజాగ్రహానికి గురవుతుంటారు. తాజాగా ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.
తన నియోజకవర్గంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. బాధ్యులైన అధికారిని ఆడవాళ్లతో తన్నిస్తానంటూ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఫకీరాతండాలో నీళ్లు రావడం లేదని చెబితే.. మరమ్మతులకు రూ.5 లక్షలు ఇచ్చి 4 నెలలవుతోంది. నేటికీ పని పూర్తిచేయలేదు. ఇలాగైతే ప్రజలు మాకు ఓట్లు ఎలా వేస్తారు’ అంటూ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మండిపడ్డారు.