తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సభలో బడ్జెట్పై వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శాసనసభ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. అధికార కాంగ్రెస్ వైఖరికి నిరసనగా సభ నుంచి వెళ్తూ నినాదాలు చేశారు.
అంతకుముందు సభలో సీఎం రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడిన భాషపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్ని విషయాల అయినా మాట్లాడవచ్చన్న ఆ పార్టీ నేతలు సీఎంగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా నిండు శాసనసభలో సహనం కోల్పోతే ఎలా అని ప్రశ్నించారు. సీఎం వాడరాని భాష వినియోగించడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలకు సీఎంపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.