త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ గెలువబోతున్నదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్‌గా వస్తున్న ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్ గెలువబోతుందన్నారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేసినట్టు సమాచారం. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ని బరిలోకి దించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై పాస్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రేపు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్టు వెల్లడించాయి.