తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ‘స్వేదపత్రం’ విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్పై బురదజల్లేందుకు యత్నించిందని మండిపడ్డారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. తమకు అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేలా కొంత ప్రయత్నం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, కువిమర్శలకు దీటుగా సమాధానం చెప్పామని తెలిపారు. బాధ్యత గల పార్టీగా ‘స్వేద పత్రం’ విడుదల చేస్తున్నామని వెల్లడించారు. కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే స్వేద పత్రం విడుదల చేస్తున్నట్లు వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు… సంక్షోభం నుంచి సమృద్ధి వైపునకు సాగిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు అన్నిరంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొందన్న కేటీఆర్.. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాకారమైందని గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు తమ వల్లనే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారని మండిపడ్డారు.