బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు నిండాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. బీఆర్ఎస్ ఆవిర్భవించి రేపటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో వరంగల్ లో భారీ సభ నిర్వహిస్తున్నారు. వేలాదిగా జనం వస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు.
వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ను ఏర్పాటు చేశారు. ఇక ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముళ్లచెట్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రతీ రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు. సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు.