తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమ వారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్ కోసం ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కసరత్తులు వేగవంతం చేసింది. బడ్జెట్ దాదాపు ఖరారు కూడా అయిపోయింది. ప్రవేశ పెట్టడమే తర్వాయి. కాగ అసెంబ్లీ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లును చేస్తున్నారు. అందులో భాగంగా బడ్జెట్ సమావేశాల నిర్వహాణకు అధికారులు నేడు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తో పాటు సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల సరళి, జీరో అవర్, ప్రశ్నోత్తరాలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పట్లపై కూడా ఈ సమావేశం లో చర్చించనున్నారు.