కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ – కాగ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టు పనితీరుకు సంబంధించిన ఆడిట్ నివేదికను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు అకౌంటెంట్ జనరల్ తెలిపారు. శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టేందుకు వీలుగా కాగ్ నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నుంచి రీ ఇంజనీరింగ్ అవసరం, చేసిన మార్పులు, రీ ఇంజనీరింగ్ విధానం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, పనులు, అంచనా వ్యయం, ఎకనామిక్ వయబిలిటీ, అనుమతులు, ఆర్థికవనరుల సమీకరణపై కాగ్ అడిట్ నిర్వహించింది.
పనుల పురోగతి, భూసేకరణ, సహాయ – పునరావాసం, డిజైన్ల ఖరారు, ఒప్పందాలు, పర్యావరణ నిర్వహణా ప్రణాళిక, అంచనాల తయారీ, వృథా ఖర్చు, టెండర్ విధానం, చెల్లింపులపై కూడా ఆడిట్ నిర్వహించారు. వాటిపై లేవనెత్తిన అభ్యంతరాలను ముసాయిదాలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన కాగ్ సర్కార్ ఇచ్చిన వివరణలను కూడా నివేదికలో పొందుపర్చింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో నివేదిక ఉభయ సభల ముందుకు రానుంది.