రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి గడువు నేటితో ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48గంటల ముందు సైలెన్స్ పీరియడ్ షురూ కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.
సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రచార గడువు ముగియనుంది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఆ మరుక్షణం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. సాయంత్రం 5 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు, నిర్వహించకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.