ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కి తెలిపారు. ఆమెను ఈ నెల 11న సుమారు 8 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఈనెల 16న మరోసారి రావాలని అదే రోజు సమన్లు జారీ చేశారు. ఆ సమన్లను రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. తక్షణమే విచారణ జరిపేందుకు నిరాకరించింది.
అయితే నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఆమె అనారోగ్య కారణంతో ఈ రోజు విచారణకు రాలేనని, మరో తేదీని నిర్ణయించాలని కోరారు. సుప్రీంలో తన పిటీషన్ పై విచారణ పూర్తయిన తర్వాతే వస్తానని చెప్పారు. ఈ మేరకు కవిత న్యాయవాది సోమ భరత్ ఈడి కార్యాలయానికి వెళ్లి ఇదే విషయాన్ని తెలిపారు. అయితే సోమ భరత్ తో పంపిన ప్రతిపాదనను ఈడీ అంగీకరించలేదు. కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె ఏం చేస్తారు? విచారణకు రాకపోతే ఈడీ తదుపరి చర్యలు ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది.