రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపుల కేసు నమోదైంది. వీరితో పాటు జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్, మున్సిపల్ మాజీ కమిషనర్ ఎండీ యూసఫ్‌పై 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీం పట్నం మున్సిపల్ కమిషనర్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
2019 ఎన్నికల సమయంలో రెండున్నర కోట్లు తీసుకొని అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి తనకు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఇచ్చినట్లు స్రవంతి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా కులవివక్ష చూపించేవారని కిషన్ రెడ్డి చెప్పినట్లు వినలేదని అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్‌తో బెదిరించి తనకు షోకాజ్ నోటీసులు ఇప్పించారని స్రవంతి తన ఫిర్యాదులో తెలిపారు. తనను వేధింపులకు గురి చేసిన నలుగురిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఛైర్మన్ సమయంలో బీఆర్ఎస్లో ఉన్న స్రవంతి ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.