ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజులపాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బుధవారం ఆయన్ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పొందుపరిచారు. ఆయనకు నాంపల్లి ఏసీబీ కోర్టు జూన్ 5వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 12 గంటల పాటు ఆయనకు సంబంధించిన ఇళ్లలో, బంధువులు, మిత్రుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి 3.95 లక్షల విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు. అందులో సందీప్ అనే వ్యక్తి పేరు ఉండడంతో అతనెవరు అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్ మాత్రమే కాకుండా ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేసేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. బుధవారం రోజున నాంపల్లి కోర్టులో కస్టడీ కోరేందుకు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.