చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉమామహేశ్వరరావును కస్టడీ ఇవ్వాలని కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం రోజున ఏసీబీ కోర్టు విచారించింది.
నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని, 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. ఈ క్రమంలో న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఈరోజు (మే 29వ తేదీ) ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఇప్పటివరకు ఉమామహేశ్వరరావుకు చెందిన రూ.3.95 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలోనే గతవారం ఉమామహేశ్వర రావును అరెస్టు చేసిన అవినీతి నిరోధకశాఖ అధికారులు కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించారు. అనంతరం, అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మరింత లోతుగా విచారించేందుకు కోర్టులో ఏసీబీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది.