తెలంగాణలో గత కొన్నిరోజులుగా రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో హెచ్ సీయూకి సంబంధించిన 400 ఎకరాలు ప్రభుత్వానివేనని ఇటీవలే టీజీఐఐసీ ప్రకటన జారీ చేసింది. దీంతో ప్రతిపక్షాలు, హెచ్ సీయూ విద్యార్థులు నిరసన గళమెత్తారు. ఈ వివాదం కాస్త పార్లమెంటుకు చేరింది. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు ఈ 400 ఎకరాలను, అందులో ఉన్న వృక్ష, జంతుజాలాన్ని కాపాడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఎట్టకేలకు కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేంద్రం స్పందించింది. ఈ భూముల విషయంలో నిజనిర్ధరణ నివేదిక పంపాలని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ సమాచారం అందించగా.. కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని కేంద్రం సూచించింది. అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని.. వాస్తవ నివేదిక, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలిపింది.